కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 12 : భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భాషలు, మతాలు కలిగిన 147 కోట్ల మంది భారతీయులను ఒక్కతాటి పైకి తెచ్చిన మన రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనా సాగిస్తోందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాప్త నిరసనల పిలుపులో భాగంగా సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్ మండల కేంద్రంలో శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ భగత్ సింగ్ చిత్ర పటాలతో మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం మానవాహారం చేపట్టి నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. కులం కన్న దేశం మిన్న అని భావించిన భగత్ సింగ్ త్రయం లాంటి అనేక మంది దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని, స్వేచ్చాయుత భారతావనికి దేశం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ అందించినట్లు తెలిపారు. అటువంటి త్యాగధనుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, ప్రశ్నించిన వారిని నిర్బంధాలకు గురిచేస్తున్నట్లు తెలిపారు. సీబీఐ, ఈడీ, ఎన్నికల సంఘం తదితర రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత ప్రదర్శిస్తున్నారన్నారు.
ఏడాదికి కోటి ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు, మహిళలపై దాడులు ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని సహజవనరులను, ప్రభుత్వ సంస్థలను, వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ విద్యను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ పేద, మధ్యతరగతి వర్గాలను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను సైతం యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే దుశ్చర్యాలకు కేంద్రం పూనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు అప్రమత్తమై కేంద్రం చర్యలను తిప్పికొట్టి దేశాన్ని బీజేపీ పాలన నుంచి రక్షించుకోవాలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, ఎం.ధనలక్ష్మి, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, కె రత్నకుమారి, తాళ్ల వెంకటేశ్వర్ రావు, నాయకులు యూసుఫ్, నేరెళ్ల రమేశ్, టి.పాపారావు పాల్గొన్నారు.
CPI : రాజ్యాంగ స్ఫూర్తికి కేంద్రం విఘాతం : ఎస్కే సాబీర్ పాషా