కొత్తగూడెం అర్బన్ , జులై 7: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడంలోని పోస్టాఫీసు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టరు వేణుగోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. 1969 ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పోలీసు కాల్పుల్లో గాయపడ్డ ఐదుగురికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ సహయం చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం, రూ.25వేల పెన్షన్ సదుపాయం కల్పించాలని వెల్లడించారు. రైలు, బస్సు ప్రయాణ చార్జీలలో 50 శాతం మినహాయింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు మెరుగైన వైద్యం కోసం తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఉద్యమకారులు తిప్పన సిద్దులు, వీరాస్వామి, పీ. రామచందర్, గౌస్, డీ.నాగేశ్వర రావు, ఎం.కొమరయ్య, బ్రహ్మం, కే.కొమరయ్య, ఎండీ. అబ్దుల్ రషీద్, సాంబయ్య, డీ.మల్లయ్య, కృష్ణార్జున రావు, సీతా రాములు, పురుషోత్తం, మౌలానా, తదితరులు పాల్గొన్నారు.