– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, డీఈఓ నాగలక్మి
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జనవరి 03 : దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సావిత్రిబాయి పూలే వంటే మహోన్నత వ్యక్తుల జీవితాలు ఆదర్శంగా తీసుకుని సమాజాన్ని బాగు చేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు.
డీఈఓ బి.నాగలక్ష్మి మాట్లాడుతూ.. బోధన కేవలం వృత్తి మాత్రమే కాదని అది ఒక సామాజిక బాధ్యత అని ఆ బాధ్యతను నిర్వహించడం ఉపాధ్యాయులుగా అందరి కర్తవ్యం అని ఉద్భోదించారు. అనంతరం 2026లో పదవీ విరమణ పొందబోతున్న 44 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు కొదుమూరు సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, వివిధ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Kothagudem Ganesh Temple : ‘బోధన కేవలం వృత్తి కాదు అది ఒక సామాజిక బాధ్యత’