– సింగరేణి భవిష్యత్, కార్మికుల సమస్యల పరిష్కారానికి 10 కీలక డిమాండ్లు
రుద్రంపూర్, జూలై 13 : కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ వినతిపత్రాన్ని అందజేశారు. సింగరేణి సంస్థలో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. వినతిపత్రంలో సింగరేణి సంస్థ భవిష్యత్, కార్మికుల సంక్షేమం, ఉత్పత్తి విస్తరణ, పారదర్శక పాలనకు సంబంధించిన పలు కీలక డిమాండ్లను ప్రస్తావించారు. సంఘం ప్రధానంగా శ్రావణపల్లి, కేకే-6 అండర్‌గ్రౌండ్ మైన్, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌తో పాటు వేలానికి సిద్ధంగా ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరింది. గతంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన కోయగూడెం–III, సత్తుపల్లి–III బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసి తిరిగి సింగరేణికే అప్పగించాలని విజ్ఞప్తి చేసింది.
సింగరేణి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే ప్రాధాన్యత కల్పించి, పెండింగ్‌లో ఉన్న పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. అలాగే టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్‌కో తదితర సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.57 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కమిటీ నిర్వహించిన సైట్ విజిట్, సి.ఎస్.ఆర్. కుంభకోణాలపై జరిగిన విచారణ నివేదికలను బహిర్గతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్సీడబ్ల్యూఏ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి కొత్త బొగ్గు వేతన ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనులను వేలం ప్రక్రియ లేకుండానే సింగరేణికి కేటాయించేలా అనుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.
2023–24 అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో బొగ్గు ఉత్పత్తి, నిల్వల గణాంకాలు, పన్ను చెల్లింపుల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)తో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. సింగరేణిలో కార్మిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు ట్రేడ్ యూనియన్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని, కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎంలో సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కూడా సంఘం కోరింది. సింగరేణి సంస్థ భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది. వినతిపత్రం అందజేసిన వారిలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాన వీరభద్రం, వైస్ ప్రెసిడెంట్లు తుమ్మ శ్రీనివాస్, గడప రాజయ్య పాల్గొన్నారు.