– అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
– టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ
రుద్రంపూర్, జూన్ 30 : సింగరేణి కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాల్లో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సంఘీభావం ప్రకటించింది. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, డివిజన్ ఉపాధ్యక్షులు గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీక్షా శిబిరాలను సందర్శించి అధికారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులకు కల్పించిన ప్రయోజనాలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు కాకపోవడం వల్ల అధికారులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, అధ్యాపకులు, మహిళలు, విద్యార్థులు, అసంఘటిత కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచిందని ఆరోపించారు. అధికారులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవేనని, పెండింగ్లో ఉన్న పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు పే అప్గ్రేడేషన్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, సింగరేణికి జెన్కో నుంచి రావాల్సి ఉన్న సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా అధికారులు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టే పరిస్థితి ఏర్పడటం విచారకరమని పేర్కొన్నారు. అధికారులు, కార్మికులు సంతృప్తిగా ఉంటేనే సింగరేణి సంస్థ అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వాసికార్ల కిరణ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు బోరింగ్ శంకర్, రవి వర్మ, బ్రాంచ్ కార్యదర్శులు శివ, విద్యాసాగర్, రాజకుమార్, పిట్ కార్యదర్శులు వెంకటేష్, సూరజ్, మోయ సూర్యనారాయణ, జయపాల్, రంజిత్, రాములు, వినయ్, ఖాజా, హైమద్, గౌరీ, రాజయ్యతో పాటు కార్పొరేట్, కొత్తగూడెం ఏరియాలకు చెందిన టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం