రుద్రంపూర్, జూన్ 05 : వసుమతి మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, వేధింపులకు కారణమైన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్నిటీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ కోరారు. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇంక్లైన్లో అప్రెంటిస్‌గా పనిచేస్తున్న గిరిజన యువతి బీజ వసుమతి (23) పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పట్ల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయం అయినప్పటికీ, వసుమతి వంటి యువతి విషాదాంతానికి గురికావడం అత్యంత బాధాకరమన్నారు.
ఎన్నో ఆశయాలతో బీటెక్ పూర్తి చేసి అప్రెంటిస్‌గా చేరిన వసుమతి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ఓదార్పుగా సింగరేణి యాజమాన్యం మానవతా దృక్పథంతో రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. వసుమతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీబీజీకేఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, లీగల్ అడ్వైజర్ జీ.కే. సంపత్, సంయుక్త కార్యదర్శి వసికర్ల కిరణ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు కాగితాపు విజయ్ కుమార్, ఎం.టెక్ మహేందర్, పీవీకే-5 కార్యదర్శి నమిల్ల వెంకటేశ్వర్లు, రవివర్మ తదితర నాయకులు పాల్గొన్నారు.