- నాలుగు పతకాలు సాధించిన జూలూరుపాడు వాసులు
జూలూరుపాడు, జూలై 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ కమ్యూనిటీ హాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడు మండలానికి చెందిన ఆరోగ్య జీవన యాత్ర బృందం సభ్యులు నాలుగు పథకాలు, ప్రశంసాపత్రాలు సాధించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొత్తం ఆరుగురు సభ్యులు ఈ పోటీల్లో పాల్గొనగా, వారిలో నలుగురు పతకాలు సాధించి జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామానికి చెందిన అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. 45-50 సంవత్సరాల విభాగంలో జూలూరుపాడు గ్రామానికి చెందిన తాళ్లూరు నవీన్ మొదటి బహుమతి సాధించగా, వెంగన్నపాలెం గ్రామానికి చెందినవేముల నాగేశ్వరరావు మూడో బహుమతి గెలుచుకున్నారు.
35-40 సంవత్సరాల విభాగంలో వెంగన్నపాలెం గ్రామానికి చెందిన వేల్పుల బోసు ద్వితీయ బహుమతి, పెండ్యాల నరేష్ తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆరోగ్య జీవన యాత్ర బృందం ప్రతినిధులు అలాగే జిల్లా యోగా అసోసియేషన్ నిర్వాహకులు శాలువాలు, ప్రశంసా పత్రాలతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ .. మానసిక ప్రశాంతతకు శారీరక దృఢత్వానికి యోగా, ధ్యానం, రోజువారీ వాకింగ్ ఎంతో అవసరం అని బద్ధకాన్ని వీడి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి అని పేర్కొన్నారు.