– గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన దిండిగాల రాజేందర్
ఇల్లెందు, డిసెంబర్ 04 : ఆదివాసి గిరిజన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సువర్ణపాక సత్యనారాయణ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఇల్లెందు మండలం తిలక్ నగర్ గ్రామ పంచాయతీ ఆలీబాబా దర్గా వద్ద బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్ కుమార్, కార్యదర్శి రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరిక కార్యక్రమంలో సత్యనారాయణతో పాటు 10 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్, సువర్ణపాక సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథంలో సాగించారని, రైతులను, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు.
మళ్లీ రానున్నది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, ప్రతి ఇంటికి సంక్షేమం చేరిందన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి ఆగిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కేసీఆర్ సువర్ణ పాలన గురించి తలుచుకుంటూ మళ్లీ ఎప్పుడు వస్తాడా కేసీఆర్ అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తిలక్ నగర్ సర్పంచ్ అభ్యర్థిగా సువర్ణపాక సత్యనారాయణను ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీలో చేరిన వారిలో కల్తి వినోద్, తాటి బాస్, వెంకటేశ్, రాంబాబు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ నాయకులు సుదర్శన్ రంగనాథ్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, ఉపాధ్యక్షుడు నబి, స్థానిక నాయకులు ఎండీ ముస్తఫా, సదరం మహేశ్, పోతిరెడ్డి సారంగపాణి, వెంకట్ రామ్, బోధగడ్ల వెంకన్న, స్టాలిన్, నరసయ్య, నాగరాజు, సారం మహేశ్ (చిన్నారి), నాను, వెంకటేశ్, కృష్ణవేణి, కుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Yellandu : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సువర్ణపాక సత్యనారాయణ బీఆర్ఎస్లో చేరిక