న్యూఢిల్లీ : పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 50కిపైగా యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని తన వైమానిక, నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 50కిపైగా ఎఫ్-16, ఎఫ్-22, ఎఫ్-35 యుద్ధ విమానాలను మోహరించినట్లు అమెరికా ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ అమెరికన్ మీడియా వెల్లడించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు పశ్చిమాసియా దిశగా పయనిస్తున్నట్లు స్వతంత్ర విమాన ట్రాకింగ్ డాటా సూచించింది.
ఇరాన్ అణు కార్యకలాపాలపై అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య పరోక్ష చర్చలు సాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆందోళనలు కొనసాగుతూ ప్రత్యక్ష పోరు అనివార్యంగా కనిపిస్తున్నప్పటికీ దౌత్యపరమైన ప్రయత్నాలు మాత్రం ఇటీవల కొన్ని వారాలుగా జరుగుతున్నాయి. తన బలాన్ని మరింత ప్రదర్శించేందుకు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ ఆగెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను పశ్చిమాసియాకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. కరీబియన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ యుద్ధ నౌకకు గతవారం అమెరికా కొత్త బాధ్యతలు అప్పగించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ త్వరలోనే సైనిక చర్యను ప్రారంభించే అవకాశం ఉందని యాక్సియోస్ వార్తాసంస్థ వెల్లడించింది. గత ఏడాది జరిగిన 12 రోజుల ఘర్షణలతో పోలిస్తే రానున్న దాడి విస్తృతి చాలా పెద్దదని, కొన్ని వారాలపాటు ఘర్షణలు కొనసాగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ యాక్సియోస్ వార్తాకథనాన్ని ప్రచురించింది. చిన్నపాటి కార్యాచరణలతో కూడిన దాడికి ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఆ తర్వాత అది పూర్తి స్థాయి సైనిక చర్యగా మారుతుందని యోక్సియోస్ తెలిపింది. ఇజ్రాయెల్‌తో కలసి అమెరికా సైనిక చర్యకు దిగవచ్చని, ఇది ప్రాంతీయ సైనిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని వార్తాసంస్థ పేర్కొన్నది. జెనీవాలో జరిగిన తాజా అణు చర్చలుసహా దౌత్య స్థాయి చర్చలు కొనసాగుతున్నప్పటికీ అవి ఫలప్రదమయ్యే అవకాశాలు కనపడడం లేదని అధికారులను ఉటంకిస్తూ వార్తాసంస్థ పేర్కొన్నది.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీచేశారు. అమెరికన్ యుద్ధ నౌకలను సముద్రం అడుగుభాగానికి పంపగల ఆయుధాలు ఇరాన్ వద్ద ఉన్నాయని ఖమేనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య జెనీవాలో అణు చర్చలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఖమేనీ నుంచి ఈ హెచ్చరికలు జారీ కావడం గమనార్హం. అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు, సముద్రంలో మునిగిపోతున్నట్లు చూపించే ఏఐ ఫొటోను ఖమేనీ షేర్ చేశారు. ఇరాన్ వైపు ఓ యుద్ధ నౌకను పంపినట్లు అమెరికన్లు నిరంతరం చెబుతుంటారని ఎక్స్‌లో ఖమేనీ పేర్కొన్నారు. నిజానికి సైనిక పరికరాల్లో యుద్ధనౌక ఓ ప్రమాదకర భాగమే. అయితే ఆ నౌకను సముద్రం అడుగుకు పంపగల ఆయుధం మరింత ప్రమాదకరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుధ సంపత్తిలో తమకు ఎవరూ సాటిలేరంటూ అమెరికా చెబుతున్న మాటలను ఆయన కొట్టివేశారు.తన దేశానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం ఉందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. అయినా అత్యంత బలమైన సైన్యం కూడా కొన్నిసార్లు తన కాళ్లపై నిలబడలేనంతగా దెబ్బలు తింటుంది అని ఖమేనీ వ్యాఖ్యానించారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రావిన్సులో బుధవారం మంటలు చెలరేగాయి. పరంద్ నగరంలోని ఓ భవనం పైనుంచి దట్టమైన పొగలు కమ్ముకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఆ ప్రదేశంలో పేలుడు సంభవించినట్లు ప్రాథమిక ఆన్లైన్ నివేదికలు పేర్కొన్నాయి. భవనం సమీపంలోని నది ఒడ్డున రెల్లు గడ్డి అంటుకోవడం వల్ల పొగ ఏర్పడిందని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబీ తర్వాత తెలిపింది.

అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నట్లు ప్రసార సంస్థ పేర్కొంది. కాగా, షిరాజ్ ప్రావిన్సులో పేలుడు సంభవించినట్లు తెలుస్తున్నది. నగర శివార్లలోని పర్వత ప్రాంతంలో పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.