– ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలి
– పాపకొల్లులో ఘనంగా వన మహోత్సవం
– జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి
జూలూరుపాడు, జూన్ 23 : పర్యావరణ పరిరక్షణ, వర్షపాతం పెంపుతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో వృక్షాలదే కీలకపాత్ర అని జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి అన్నారు. సవన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరి స్వచ్ఛంద భాగస్వామ్యంతోనే ఈ బృహత్తర కార్యక్రమం పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు, అధికారులు కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా, నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు.
ఈ మేరకు మొక్కల సంరక్షణకు అవసరమైన పటిష్ట చర్యలు, ట్రీ గార్డుల ఏర్పాటు లాంటివి చేపట్టాలని స్థానిక సర్పంచులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా కాలుష్య రహిత, ఆరోగ్యకరమైన పల్లెల నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, అది మహావృక్షం అయ్యేలా దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. మండల ప్రజలందరూ ఈ వన మహోత్సవంలో అత్యంత చురుకుగా పాల్గొని హరిత లక్ష్యాలను సాధించడంలో తమ వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఏపీఓ, పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.