రుద్రంపూర్, మే 21 : రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మోడు వారుతున్న చెట్లుపై “నమస్తే వెబ్” లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్ ఎన్.రాజశేఖర్ స్వయంగా ముందుకు వచ్చి ఆ చెట్లకు నీళ్లు పట్టించి వాటికి జీవం పోసే ప్రయత్నం చేశారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో నీటి వసతి సమృద్ధిగా ఉన్నప్పటికీ చెట్లకు సరైన సంరక్షణ లేక ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండగా, చెట్లను కాపాడాలనే సంకల్పంతో తానే స్వయంగా నీరు అందించినట్లు తెలిపారు.
రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే ఈ చెట్లు మళ్లీ చిగురిస్తాయి. పెరుగుతున్న ఎండల్లో చెట్లు మనకు నీడనూ, ప్రాణ వాయువునూ అందిస్తాయి. చెట్టు కింద కూర్చొని మాట్లాడేవారు, విశ్రాంతి తీసుకునేవారు కనీసం తమ వద్ద ఉన్న నీటి బాటిళ్లలో మిగిలిన నీటినైనా ఒక చెట్టుకు పోస్తే అది గొప్ప సేవ అవుతుందని అన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా రోజుకొకరు చొప్పున చెట్లకు నీళ్లు పోస్తే ఈ ప్రాంగణం పచ్చదనంతో నిండిన మంచి వనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మోడు వారుతున్న చెట్లను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.