జూలూరుపాడు, మార్చి 18 : ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రణాళికయుతంగా చదివి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు మంగళవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను సరిగ్గా ఎంచుకుని నిబద్దతతో గమ్యాలను చేరుకోవాలని సూచించారు. పదో తరగతిలో మంచి గ్రేడ్లు సాధించి పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు.
తల్లి, తండ్రి, తర్వాత గురువు పాత్ర ఎంతో ముఖ్యమని, గురువును మించిన దైవం లేదన్నారు. ఈ నెల 21 నుండి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను చక్కగా చదువుకుని మంచిగా రాయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లక్ష్మీనరసయ్య, ఏఏపిసి చైర్మన్ మంద స్రవంతి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు శాంత కుమారి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, జివిఆర్ ప్రసాద్, కృష్ణ, గురుమూర్తి, ఎస్వీ పటేల్, శకుంతల, ఉమా, లలిత, సునీత, నాగ పాల్గొన్నారు.