కవికుల గురువైన కాళిదాసు ‘కుమార సంభవం’,‘రఘువంశం’ అనే రెండు ఐతిహాసిక శ్రవ్య మహాకావ్యాలను (EPICS) రచించి, సంస్కృత భారతికి తరగని సంపదలుగా సమర్పించాడు. దీంతో ఆయన మహాకవిగా ఎనలేని గొప్ప పేరు సంపాదించాడు.
మహాకవిగానే కాకుండా ‘మాళవికాగ్నిమిత్రమ్’, ‘విక్రమోర్వశీయమ్’, ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ అనే మూడు దృశ్యకావ్యాలను (నాటకాలు) విరచించి ఘనకీర్తిని గడించాడు. తన అపురూప నాటక రచనా వైదుష్యంతో సంతరించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంతో ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు.
కాళిదాసుకు పూర్వ నాటక రంగం క్రీ.పూ 4వ శతాబ్దికి చెందిన ‘పాణిని’ తన సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘అష్టాధ్యాయి’లో ‘పారాశర్య శిలాలోలిభ్యాం భిక్షునట సూత్రయోః’ అంటూ నటసూత్ర లక్షణ గ్రంథాన్ని పేర్కొనడాన్ని బట్టి ఆ కాలంలోనే నాటకాలు, నాటక ప్రదర్శనలు విరివిగా ఉన్నట్టు తెలుస్తున్నది. మహాభాష్యకారుడైన పతంజలి (క్రీ.పూ.1వ శ.) ‘కంసవధ’, ‘వాలివధ’ నాటకాలను ప్రస్తావించాడు. ఇంకా, కాళిదాసుకన్నా ముందు ‘బుద్ధ చరిత్ర’ నాటకం రాసిన అశ్వఘోషుడు (క్రీ.శ.1వ శతాబ్ది), భారతేతిహాసాల కథలతో పదమూడు నాటకాలు రాసిన భాసుడు (క్రీ.శ.4వ.శ.) మున్నగువారు ఉన్నారు.
కాళిదాసు మాళవికాగ్నిమిత్రమ్
మహాకవి కాళిదాసు రచించిన మొదటి నాటకం ‘మాళవికాగ్నిమిత్రమ్’. ఇది ఇద్దరు చారిత్రక వ్యక్తుల ప్రణయ కథ. ఈ నాటక కథానాయకుడు రాజు అగ్నిమిత్రుడు. క్రీ.పూ. 185లో మౌర్యరాజు బృహద్రధుడిని వధించి ‘శుంగరాబివంశం’ను స్థాపించిన పుష్యమిత్ర శుంగుడి పుత్రుడే ఈ అగ్నిమిత్రుడు. ఈ వంశపాలన (క్రీ.పూ.185-73)లోనే విదిశ రాజధానిగా వర్ధిల్లింది. (అశోక్ చక్రవర్తి భార్య విదిశ పేరుతో ఏర్పడిన ఈ నగరం భోపాల్‌కు సమీపంలో బెత్వా-బేసా నదుల సంగమ స్థలంలో నెలకొని ఉన్నది).
ఇక విదర్భ (ఇది మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతం) యువరాజు మాధవసేనుడి చెల్లెలు మాళవిక. ఇందులోని కథానాయిక. మాళవికతో ప్రేమలో పడేనాటికే రాజు అగ్నిమిత్రుడికి-పట్టమహిషిధారిదేవితో ధారిణీదేవి అనే మరో భార్య ఉన్నది. వసుమిత్రుడు అనే కొడుకు ఉన్నాడు. యువరాజుగా సింధు నదీ తీరంలో గ్రీకు అశ్వికదళాన్ని ఓడించిన వీరుడు ఇతడు. ఈ నాటకంలోని స్థూల కథ ఏమిటంటే.. విదర్భ యువరాజు మాధవసేనుడు తన చెల్లెలు మాళవిక వివాహాన్ని అగ్నిమిత్రుడితో జరిపించడానికి చెల్లెలూ, పరివారంతో ‘విదిశ’కు బయలుదేరుతాడు. కానీ దారిలో తన దాయాది యజ్ఞసేనుడికి బందీగా చిక్కుతాడు.
మాళవిక తప్పించుకొని వర్తక బృందంతో ప్రయాణిస్తుండగా దొంగలు అడ్డగిస్తారు. ఆ సమయంలో అగ్నిమిత్రుడు సేనాని, బావమరిదీ అయిన వీరసేనుడు మాళవికను రక్షించి, తీసుకువచ్చి, అక్క ధారిణీదేవికి అప్పగిస్తాడు.
సామాన్య వేషంలో ఉన్న మాళవికను ధారిణీదేవి పరిచారికగా ఉంచుకొని నాట్యం నేర్పిస్తుంటుంది. ఈ ధారిణీదేవి, మరో రాణి ఇరావతి..రాజు కంటపడకుండా మాళవికను జాగ్రత్తపడుతుంటారు. అయినా, అగ్నిమిత్రుడు తన మిత్రుడు గౌతముడి (విదూషకుడి) సహాయంతో మాళవికను రహస్యంగా కలుసుకుంటాడు. వారిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. కొద్దిరోజులకు మాధవసేనుడు పంపించిన శిల్పకారికలు అగ్నిమిత్రుడు ఆస్థానానికి చేరి, మాళవికను తమ రాజకుమారి అని గుర్తించి అగ్నిమిత్రుడికి విన్నవిస్తారు. ధారిణీదేవి అంగీకారంతో మాళవికాగ్నిమిత్రుల వివాహం అవుతుంది.
క్రీ.పూ. నాటి అగ్నిమిత్రుడు (అగ్నిమిత్రుడి పాలన క్రీ.పూ.149-141). మాళవికల ప్రణయ కథను క్రీ.శ. 5వ కవి కాళిదాసు దశరూప భేదాల్లో ఒకటైన ‘ప్రకరణం’ నాటక భేద పద్ధతిలో అయిదు అంకాల నాటకంగా రచించాడు. (సామాన్యులు ప్రధాన పాత్రలుగా నుండి నాటకాన్ని ‘ప్రకరణం’ అంటారు. ఇందుకు మరో ఉదాహరణ: రాజు శూద్రకుడు (క్రీ.శ. 5వ శతాబ్ది) రచించిన ‘మృచ్ఛకటికమ్’ నాటకం). కాళిదాసు ఈ ‘ప్రకరణం’ నాటకాన్ని ‘ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే’ అంటూ నాందీ శ్లోకంలో శివస్తుతి చేస్తూ నాటకం ప్రారంభిస్తాడు. నాటక ‘ప్రస్తావన’లో ‘ప్రధితయతశసాంభాస, సౌమిల్లక, కవిపుత్రాదీనాం’. ఇప్పటికే సుప్రసిద్ధులైన భాస, సౌమిల్లక, కలిమితుడు మున్నగువారి నాటకాలను పక్కకు పెట్టి, వర్ధమాన కవి కాళిదాసు నాటక రచనలపై సభ్యులకు (ప్రేక్షకులకు) ఆదరమెట్లు కలుగుతుంది అని పారిపార్శకునితో కాళిదాసు అనిపిస్తాడు. (సౌమిల్లకుడు, కలిమితుడు వీరిద్దరి రచనలేవీ కనిపించడం లేదు).
ఆ వెంటనే సూత్రధారుడి నోట ‘పురాణ మిత్యేవ న సాధుసర్వం/న చాపి కావ్యం నవ మిత్య వద్యమ్/సంతః పరీక్షాన్యతర ద్భజంతే/మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః (అంకం 1, శ్లో-2). కావ్యం పాతదైనంత మాత్రాన అంతా మంచిదైపోదు. అట్లే కావ్యం కొత్తదైనంత మాత్రాన అంతా నింద్యమూ కాదు. సత్పురుషులు కొత్త, పాతలను చక్కగా పరిశీలించి వాటిలోని మంచినే గ్రహిస్తారు. మూర్ఖుల బుద్ధియే-ఇతరుల అభిప్రాయంతో నడిపించబడుతుందని సార్వకాలికాభిప్రాయాన్ని కాళిదాసు ప్రకటింపజేస్తాడు.‘సఖి! ఈ దృశేన వ్యాపారేణ అసన్నిహితాపి దృష్ట్యాకిల సా భర్త్రా’ (అంకం 1). చెలీ! నాట్యాభ్యాసం వలన మాళవిక మహారాణికి దగ్గరగా లేకపోయినా ఆమెను రాజు చూశాడటగా-అంటూ కౌముదిక అనే చెలికత్తె వకుళావళిక అనే మరో చెలికత్తెతో చెప్పిన సంభాషణలో వెనుక ఉన్న కథను దృశ్యమానం చేస్తాడు కాళిదాసు.
ప్రథమాంకంలో మాధవసేనుడి పెదతండ్రి పుత్రుడైన యజ్ఞసేనుడు రాసిన లేఖను అగ్నిమిత్రుడి ఆజ్ఞతో అమాత్యుడు చదువుతూ ‘తన్నవోన విదితం యత్తుల్యాభినేషు అభిబినేషు’ (అంకం -1, పు-27) ఒకే వంశంలో పుట్టినవారు రాజ్యం అపహరించునపుడు రాజుల ప్రవర్తన ఇట్లాగే ఉంటుందని తమకు తెలియంది కాదు. పూజ్యులైన తమరు తటస్థులుగా ఉండడం మంచిది అంటూ చెప్పిన అంశంతో కాళిదాసు ఆ కాలం నాటి రాజుల రాజ్యకాంక్షకు అద్దం పట్టాడు.
రెండవ అంకంలో నాట్య ప్రదర్శనకు సిద్ధమైన మాళవిక రూపురేఖలను-‘దీర్ఘాక్షం, శరదిందుకాన్తివదనం (అంకం-2, శ్లో-3)-విశాల నేత్రాలు కలదీ, చంద్రకాంతి వంటి ముఖం కలదీ అని అగ్నిమిత్రుడి ముఖత: చక్కగా వర్ణించాడు. ‘దుర్లభ ప్రియా మే తస్మిన్ భవ హృదయ’ (అంకం-2, శ్లో-4)-నాకు ప్రియుడు దుర్లభుడు, కనుక హృదయమా..నిరాశను పొందుము. నా ఎడమకన్నెందుకో అదురుతున్నది. చిరకాలానికి కనబడిన ఓ నాథా! నేను పరాధీనను. నీపై నాకు మక్కువ కలదని తెలుసుకో-అని నాట్యం చేస్తూ పాడే గీతంలో కాళిదాసు మాళవిక అంతరంగ భావాన్ని ఆవిష్కరింపజేస్తాడు.
ఇక గౌతముడి (విదూషకుడి) ‘భవతీ! విశేణ విశేషేణ’ రాణిగారూ, విశేషించి భోజనాన్ని త్వరగా పెట్టించండి అంటూ-‘దృఢం విపణి కందు రివ’ అంటూ ‘అంగడిలోని పెనము వలె నా కడుపు లోపల తీవ్రంగా కాలుచున్నది’ అంటూ చెప్పే సంభాషణల్లో హాస్యాన్ని చిలకరించాడు.
విదర్భ యువరాజు మాధవసేనుడు పంపించిన శిల్పకారికలు రబినిక, జ్యోత్స్నికలు-అగ్నిమిత్రుడి ఆస్థానానికి వచ్చి పరిచారికగా ఉన్న మాళవికను గుర్తించి, ఆమె తమ దేశ రాజకుమారి అని నిజం చెప్పేస్తారు. పట్టమహిషి ధారిణీదేవి-రాజు అగ్నిమిత్రుడు, మాళవికల వివాహానికి సమ్మతిస్తుంది. అప్పుడు కాళిదాసు-పరివ్రాజిక అయిన కౌశికి పాత్రలో-‘ప్రతిపక్షణాపి పతిం సేవంతే’ (అంకం-5) సాధ్వీమణులైన రాణులు-సతిని అందించడం చేత కూడా తమ భర్తను సేవిస్తారు. సముద్రంలో కలవడానికి వెళ్లే వందల మహానదులు ఇతర ప్రవాహాలనూ తమతో సముద్రానికే చేరుస్తాయి కదా-అని పలికించి, ఆనాటి రాజకుటుంబాల్లోని బహుభార్యత్వ సంప్రదాయాన్ని సమర్ధిస్తాడు. తర్వాత అగ్నిమిత్రుడు, మాళవికల వివాహంతో ఈ నాటకం సుఖాంతం అవుతుంది. మహాకవి కాళిదాసు-తన మొదటి ఖండకావ్యాలైన ‘రుతుసంహారః’, ‘మేఘసందేశం’ల తర్వాత ఈ ‘మాళవికాగ్నిమిత్రమ్’ నాటకాన్ని రాసి ఉం టాడు. కనుకనే ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకంలో ఉన్నంత పరిణతి ఇందులో కనిపించదనీ పండితాభిప్రాయం.
-రఘువర్మ టీఎల్ఎన్
9290093933