– భద్రాద్రి కొత్తగూడెం డీపీఓ సుధీర్
బూర్గంపహాడ్, ఏప్రిల్ 02 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికేనని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా ఆయా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. గ్రామ సభల ఆరంభంలో రాష్ట్ర గీతం ఆలపించి సభలను ప్రారంభించి సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, పెంచిన పింఛన్ల పథకాలపై గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.
మోరంపల్లిబంజర్ పంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, ఎంపీడీఓ జమలారెడ్డి పాల్గొని గ్రామాల్లో సమస్యలు ఉంటే సభలో తమ దృష్టికి తీసుకురావాలని, లబ్ధిదారులకు పింఛన్లు, ఇతరత్రా సమస్యలుంటే దరఖాస్తు చేసుకుంటే 99 రోజుల ప్రణాళికలో భాగంగా వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆయా పంచాయతీల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు సక్రమంగా అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ గ్రామ సభల్లో ఆయా పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.