Amit Shah : పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ నిర్భయంగా ఓటేయాలని, అధికార టీఎంసీని బంగాళాఖాతంలో కలపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజధాని కోల్‌కతాలో బీజేపీ గురువారం నిర్వహించిన ర్యాలీలో షా ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార టీఎంసీపై, సీఎం మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టీఎంసీ గూండాలకు ఈసారి ఓటర్లు ఎవరూ భయపడవద్దని అమిత్ షా సూచించారు. ‘‘ఈసారి ఓటర్లకు భయం లేదు. బెంగాల్ ఓటర్లు ఓటు వేయకుండా ఏ గూండా అడ్డుకోలేడు. భయం లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. టీఎంసీని బంగాళాఖాతంలో కలపాలి. భవానిపూర్‌లో మార్పు కోరుకుంటున్నారా.. లేదా..? మీరు సువేందు అధికారికి ఓటు వేయాలి అని అడిగేందుకు ఇక్కడికి వచ్చాను. ఈసారి బెంగాల్లోనే కాకుండా.. మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానిపూర్‌లో కూడా మార్పు రాబోతుంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడైన సువేందు అధికారి మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానిపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దెదించడంతోపాటు మమత నియోజకవర్గంలోనే ఆమెను ఓడించాలనే లక్ష్యంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.
గురువారం నాడు సువేందు అధికారి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని, సువేందు అధికారి గెలుపునకు ఉపయోగపడుతుందని అక్కడి నేతలు అంటున్నారు. ఈ నియోజకవర్గాన్ని, మమత ఓటమిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. త్వరలో ఇక్కడ ప్రధాని మోదీతో కూడా ప్రచారం చేయించబోతుంది. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23, 29 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.