ఇల్లెందు, ఏప్రిల్ 02 : ఇల్లెందు మున్సిపాలిటీ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత గ్రామ సభకు రాకపోవడం, వార్డులో అందుబాటులో ఉండకపోవడంతో స్థానిక ప్రజలు గ్రామ సభను బహిష్కరించారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కొండపల్లి సరిత గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా వార్డు సమస్యలపై వార్డు ప్రజల వద్దకు రాలేదని, పట్టించుకోవడం లేదని, ఈరోజు జరిగిన గ్రామ సభకు కూడా హాజరు కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ సభను బహిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తాం.. అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాం. గెలిచాక వార్డుల సమస్యలపై పట్టించుకోకుండా కనీసం వార్డుకు ఒక్కసారి కూడా రాకుండా వార్డు సమస్యలను ఎవరికి తెలపాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వార్డు కౌన్సిలర్ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రాజారాం, రామకృష్ణ, రాజేశ్వరరావు, దామోదర్, భిక్షపతి పాల్గొన్నారు.

ఇల్లెందు మున్సిపాలిటీ 23వ వార్డు గ్రామ సభ బహిష్కరణ