బూర్గంపహాడ్, ఏప్రిల్ 02 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో ఇటీవల ప్రజలు, ప్రయాణీకుల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్‌ను ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వేసవి సమీపించడంతో పబ్లిక్ టాయిలెట్ నిర్వహణ బాధ్యతలు చూసే సిబ్బంది వసతులపై మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎండలు మండుతున్న క్రమంలో పబ్లిక్ టాయిలెట్ వద్ద నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఓ కార్మికుడు కుర్చీలో కూర్చుని ఎండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ కార్మికుడికి నీడ కరువైందని..మండే ఎండల సమయంలో ఇలా విధులు నిర్వహించడం ఏమిటని పలువురు ఆయన బాధను చూసి చలించిపోతున్నారు. ఐటీసీ యాజమాన్యం, పంచాయతీ పాలకవర్గం స్పందించి పబ్లిక్ టాయిలెట్ ప్రాంతంలో షెడ్ లాంటిది నిర్మించి ఫ్యాన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.