ఇల్లెందు, అక్టోబర్ 27 : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. సోమవారం ఇల్లెందు పట్టణం కొత్త కాలనీలో చైతన్యం -డ్రగ్స్ పై యుద్ధంలో భాగంగా ఇల్లెందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని జెకె కాలనీ ఉన్న కొత్త కాలనీలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం సుమారుగా వంద ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను,10 ఆటోలను వెరిఫై చేసి పంపారు. ఐదు బైకులు సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ మాట్లాడారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.
అదే విధంగా చైతన్యం పేరుతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా యువత డ్రగ్స్ మహమ్మారిన పడకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్దాల వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు తాటిపాము సురేశ్, బత్తుల సత్యనారాయణ, ఎల్.రవీందర్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది పాల్గొన్నారు.

Yellandu : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : డీఎస్పీ చంద్రభాను