– సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు
– సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రైల్వే సైడింగ్ పనుల పరిశీలన
రుద్రంపూర్, జనవరి 28 : ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజువారీ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నూతనంగా జరుగుతున్న రైల్వే సైడింగ్ పనులను ఏరియా జీఎం శాలెం రాజు, సివిల్ జిఎం వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించి సమీక్ష నిర్వహించారు. అనంతరం వికేఓసి సి.హెచ్.పి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, అక్కడ చేపడుతున్న పనులను పరిశీలించారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులపై జీఎం ఎం. శాలెం రాజును అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నూతనంగా అనుమతులు వచ్చిన వికేఓసి బొగ్గు ఉత్పత్తి ప్రారంభ పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా చేపట్టాలని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే బొగ్గు ఉత్పత్తి, రవాణాలో రోజువారీ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని, రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. బొగ్గు నాణ్యత, సామర్థ్యం పెంచే దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జీఎంతో పాటు సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) సి.హెచ్.రామకృష్ణ, ఏరియా సెక్యూరిటీ అధికారి యూ.అభిలాష్, ఇతర అధికారులు, సర్వే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.