అశ్వారావుపేట, డిసెంబర్ 23: వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధితోపాటు రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అన్నదాతలు సంతోషంగ ఉంటేనే.. యావత్ దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఆయన శుక్రవారం అశ్వారావుపేటలో జాతీయ రైతు దినోత్సవంలో మాట్లాడారు. ‘వ్యవసాయమంటేనే దండుగ’ అనే నిరాశ-నిస్పృహ ఒకప్పు డు సమైక్య రాష్ట్రంలో ఉండేదని అన్నారు. నాటి రైతాంగ పరిస్థితులే దీనికి కారణమన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఈ పరిస్థితి సమూలంగా మారిపోయిందని, ‘వ్యవసాయం అంటే.. దండుగ కాదు, పండుగ’ అనే స్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు.
వ్యవసాయాభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో మొత్తం స్వరూ పం మారిపోయిందని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా పథకాలుగానీ, సంక్షేమంగానీ లేదని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, భూగర్భ జలాల పెంపునకు మిషన్ కాకతీయ, పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, రైతు కుటుంబానికి ఆర్థిక భరోసాగా రైతు భీమా, పంటల నిల్వలకు గోదాముల నిర్మాణం వంటి అనేకానేక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. అందుకే, ఇతర రాష్ర్టాల్లోని రైతులు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారని, కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కర్షకులకు సన్మానం
రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతులను మండల ఫెర్టిలైజ ర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోడ బాలూనాయక్ సన్మానించారు. స్థానిక బోడు రోడ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ రైతులు వడ్డె అంజయ్య, చిర్ర వెంకటయ్య, బానోత్ ఊక్లా, మూతి కృష్ణ, మీసాల రా ములు, భండారి శ్రీను, రాచమల్ల నర్సయ్య.. సన్మానం అందుకున్నారు. వ్యవసాయ విస్తరణాధికారి విశాల, ఎం పీటీసీ సభ్యుడు బాలకృష్ణ, అసోసియేషన్ నాయకులు కె.నాగయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.