– సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం, యూనియన్ నాయకులకు రిటైర్డ్ ఉద్యోగి విన్నపం
రామవరం, అక్టోబర్ 09 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన కంభంపాటి శ్రీనివాసరావు ఇటీవల పదవీ విరమణ పొందారు. కాగా తన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, జేఏసీ నాయకులకు, అధికారులకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసరావు కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సూపరింటెండెంట్‌గా పని చేశారు. 2025 మార్చి 31న పదవీ విరమణ పొందారు. అయినా ఇప్పటివరకు తనకు జీపీఎఫ్, పీఆర్సీ 2020 ఏరియర్స్, 300 డేస్ ఈఈఎల్, డీఏ ఏరియర్స్, అలాగే 2024లో సరెండర్ చేసిన ఈఎల్స్‌కు సంబంధించిన డబ్బులు కూడా అందలేదని వాపోయాడు.
ఆరోగ్య పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, ఇప్పటికే రెండు సార్లు హార్ట్ స్ట్రోక్ కు గురైనట్లు తెలిపాడు. ఇటీవల కొత్తగూడెంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఆయనకు మరోసారి స్టంట్ వేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారని, అంతేగాక వెన్నుపూసకు సంబంధించిన L4- L5 సమస్యతో ఓపెన్ సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. పిల్లవాడి పెండ్లి, ఇల్లు నిర్మాణం, భార్య మోకాళ్ల చికిత్స వంటి కుటుంబ బాధ్యతలు ఉండగా, రిటైర్మెంట్ డబ్బులు ఆలస్యమవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదన్నాడు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగి పరిస్థితి ఇదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పరిస్థితి, తన ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం, జేఏసీ సంబంధిత శాఖాధికారులు ఈ విషయాన్ని గమనించి తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.