బూర్గంపహాడ్, మే 13 : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మికులతో కలిసి తాసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండవ విడత మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకే ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ 15న దేశ వ్యాప్తంగా ఉపాధి కార్మికుల సమ్మె జరుగుతుందని తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్కు అందజేశారు. స్పందించిన తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ పేదల సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యురాలు ఎస్కే.అబీద, బయ్యా రాము, మరియమ్మ, చిన్నమ్మాయి, పద్మ, కనకదుర్గ, కుర్సా తిరుపతయ్య, మంగ, మీనా, శివ పాల్గొన్నారు.