- ఖమ్మం జిల్లాకు నీళ్లివ్వడంపై అభ్యంతరం లేదు.. కానీ భూములిచ్చిన మా రైతుల మాటేంటి?
– జూలూరుపాడు వద్ద రాజీవ్ లింక్ కెనాల్‌ను పరిశీలించిన సీపీఐ బృందం
– మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
జూలూరుపాడు, ఆగస్టు 28 : సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలకూ సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులతో కలిసి శుక్రవారం జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ సమీపంలో గల రాజీవ్ లింక్ కెనాల్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సాగునీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు పనుల పురోగతి, నీటి విడుదల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తరలించడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, సీతారామ కెనాల్ నిర్మాణానికి భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల రైతులు తమ విలువైన భూములను త్యాగం చేశారని, నేడు వారికే సాగునీరు అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైతులకు తక్షణమే నీరందించాలని కోరారు.
జూలూరుపాడు మండలంలోని కప్పలకుంట, శనగ చెరువు, దండ్యాల చెరువుల్లోకి ముందుగా గోదావరి జలాలను నింపి, అక్కడి నుండి సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువుకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనివల్ల ఆయకట్టు పరిధిలోని పంటలు ఎండిపోకుండా ఉంటాయని వివరించారు. ఇప్పటికే ఈ అంశాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బూర్గంపాడు, అశ్వారావుపేట, ఇల్లందు, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని రైతాంగానికి సాగునీరు అందేలా ప్రత్యేకంగా రెగ్యులేటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. నాడు కృష్ణా, గోదావరి జలాల కోసం కమ్యూనిస్టు పార్టీలు అలుపెరగని పోరాటాలు చేశాయని గుర్తుచేసిన ఆయన.. జిల్లా రైతాంగానికి సాగునీరు అందేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడూ గణేష్, సీతారామ ప్రాజెక్టు ఈఈ మహేశ్వరరావు, డీఈ చంద్రశేఖర్, ఏఈ శ్రావణి, సుజాతనగర్ ఎంపీడీవో భారతి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్, సీపీఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, నాయకులు యలంకి మధు, ఎస్కే నాగుల్‌మీరా, తాతా నరసింహారావు, చెరుకుమల్ల రాజేశ్వరరావు, ఊడల సుధాకర్, షేక్ చాంద్ పాషా, రైతులు పాల్గొన్నారు.

భద్రాద్రి జిల్లాలోని ప్రతి ఎకరాకు సీతారామ జలాలు అందించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు