ఇల్లెందు, జూలై 16 : ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఆంధ్రాకు తరలించుక పోతుంటే, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంజీవ నాయక్ ప్రశ్నించారు. బుధవారం ఇల్లెందు పట్టణం స్థానిక పెన్షనర్ల భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మరలా నీళ్లను ఆంధ్రాకు తరలించుకపోతున్నదన్నారు.
ఇలాగే కొనసాగితే కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే ఇల్లెందు నియోజకవర్గ పరిధి బయ్యారం మండలంలో కేసీఆర్ శవయాత్ర చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాయకులు గత పదేండ్లు బీఆర్ఎస్లోనే ఉన్నారని, శవయాత్ర చేయాల్సింది జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేకు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.రంగనాథ్, అబ్దుల్ నబీ, చీమల సత్యనారాయణ పాల్గొన్నారు.