జూలూరుపాడు, జూన్ 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ప్రతి గ్రామానికి సీతారామ ప్రాజెక్ట్ నీటిని అందజేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వ్యవసాయ కాలం ప్రారంభం సందర్భంగా పంట పొలాలకు పిల్ల కాల్వలు ఏర్పాటు చేసి సీతారాం ప్రాజెక్ట్ నీరు అందజేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్‌ను ఖమ్మం జిల్లాకు కలపడాన్ని తక్షణమే మానుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వార్థం కోసం జిల్లా రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను, 420 హామీలను తక్షణమే అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయని పక్షంలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వబోమని హెచ్చరించారు. సిపిఎం పార్టీ జూలూరుపాడు కమిటీ నూతన సభ్యులుగా బోడా అభిమిత్ర, ధరావత్ రమేశ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి యాసా నరేశ్, వలమల చందర్ రావు, పదం సుగుణ, గడిదేసి కనకరత్నం, ఊడల వెంకటేశ్వర్లు, రెడీపోయిన గోవింద్, మాలోత్ రాములు, జేల్లికి రాధాకృష్ణ పాల్గొన్నారు.