చుంచుపల్లి, జూన్ 09 : భధ్రాద్రి జిల్లాలో నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్ట్‌కు ఇక్కడి రైతులు భూములిస్తే వారికి నీళ్లిందివ్వకుండా వేరే ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు సంకుబాపున అనుదీప్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు మాజీ ఎంపీపీ బాదవత్ శాంతి ఆధ్వర్యంలో సొమవారం చంచుపల్లి తాసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతాంగానికి సాగునీరు అందించాలనే సంకల్పంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్‌ను సుమారు రూ.18 వేల కోట్లతో నిర్మించి 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలోని రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందుతుందని తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు నుండి మిగిలిన జిల్లాలకు సాగునీరు వెళ్లడానికి ఇక్కడి రైతులు భూములు ఇచ్చారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఖమ్మం జిల్లాలోని ముగ్గురికి మంత్రి పదవులు రావడంతో ఈ ముగ్గురు మంత్రులు భద్రాద్రి జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకి తరలించుకుపోతున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నీరును భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి అందించిన తర్వాతే మిగిలిన జిల్లాలకు ఇవ్వాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తొగరు రాజశేఖర్, పవన్ నాయక్ ప్రతాప్, రాజేశ్, బొమ్మిడి శ్రీకాంత్, ముత్యాల రాజేశ్, సదా మోహన్, మూడు జయరాం, మందుల జయరాజ్, తేలిక శివ, కనుకుంట్ల రవి, దీపక్, కన్ని, ఓం ప్రకాశ్, గుమ్మడి సాగర్, మాజీ సర్పంచ్ పవన, రవితేజ, జాహిద్, హైమద్, షోయబ్, నగేశ్, మనోహర్, శేఖర్, నవీన్, రమేశ్ పాల్గొన్నారు.