– డీటీకు వేపలగడ్డ గిరిజన రైతుల వినతి
బూర్గంపహాడ్, మే 05 : తమ భూముల మీదుగా సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువలు వెళ్లకుండా నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ పంచాయతీ గిరిజన రైతులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో డీటీ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. జనవరి 2026 నుండి రైతులకు ఎలాంటి సమాచారం, పీసా చట్టం గ్రామ సభ తీర్మానం లేకుండా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పిల్ల కాలువలు తీయడానికి తమ భూముల సర్వే నిర్వహిస్తున్నారని ఆ వినతిలో ఆరోపించారు. ఆ భూముల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ముందస్తు సమాచారం లేకుండా ఎకరం, అరెకరం మాత్రమే కలిగి ఉన్న భూముల్లో పిల్ల కాలువలు అవసరం లేదని, దీనివల్ల తమకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో సీతారామ కాలువకు భూములు తామే ఇచ్చామని, కిన్నెరసాని కాలువకు సైతం ఇచ్చామని..ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువలు తీస్తే పూర్తిగా భూములు కోల్పోయి రోడ్డున పడతామని, తక్షణమే సర్వేను నిలిపివేసి పిల్ల కాలువలు తీయకుండా పీసా చట్టాన్ని గౌరవించి సర్వేను రద్దు చేసి రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆ వినతిలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆదివాసీ మండల నాయకులు మెండి భాస్కర్‌తో పాటు వేపలగడ్డకు చెందిన గిరిజన రైతులు హోలీ, బద్రు, వీరభద్రం ఉన్నారు.