బూర్గంపహాడ్, జూలై 01 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరిగే సర్వేలో అర్హత కలిగి ఉన్న ఒక్క ఓటరు ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందని బూర్గంపహాడ్ డిప్యూటీ తాసీల్దార్ సమ్మయ్య అన్నారు. బుధవారం తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ ఆదేశాల మేరకు అఖిలపక్ష నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఎలకు తాసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, బీఎల్ఓ, బీఎల్ఎలు సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు ఇంటికి వెళ్లిన సమయంలో వారికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి వాటిని అవసరమైతే పూర్తి చేయాలని, దానిపై ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించి దగ్గరుండి తప్పులు లేకుండా ఫారం -నింపేలా చూడాలన్నారు. సర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినప్పుడే అర్హత కలిగిన ఓటర్ల ఓట్లు జాబితా నుంచి పోకుండా ఉంటాయన్నారు.
బీఎల్ఓ, బీఎల్ఎలు ఈ సర్వేను పకడ్బంధీగా నిర్వహించి గడువులోగా పూర్తి చేయాలన్నారు. సదస్సులో బీఎల్ఓ, బీఎల్ఎ, అఖిలపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబులు ఇచ్చి వారికి సర్ ప్రక్రియపై మరింత అవగాహన కల్పించారు. కుటుంబంలో ఓటర్ల వివరాలు ఒకే చోట నమోదు చేసే ఫ్యామిలీ మ్యాపింగ్ అత్యంత కీలకమని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా పరిగణిస్తారని, ఆదార్లో ఉన్న వివరాలకు అనుగుణంగానే ఫారం నింపాలని, అవసరమైన డిక్లరేషన్‌పై సంతకం చేయించాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సదస్సులో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీర్రాజు, వెంకటేశ్వర్లు, జీపీవోలు, ఏఎస్వీ ప్రదీప్ పాల్గొన్నారు.