రామవరం, సెప్టెంబర్ 25 : సింగరేణి వార్షిక లాభాల వాటా విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేశాయని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్‌రావు అన్నారు. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పీవీకే 5లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలు రూ.6,400 కోట్లు నికరంగా సంస్థకు రాగా రూ.4 వేల కోట్లు సంస్థ అభివృద్ధికై పక్కన పెట్టడం రాజకీయ కుట్రనే అన్నారు. లాభాల వాటాల్లో మిగిలిన రూ.2,360 కోట్ల నుండి కార్మికులకు 34 శాతం వాటాగా రూ.819 కోట్లు ప్రకటించారు. గతేడాది కన్నా ఈ సంవత్సరం అధిక లాభాలు వచ్చినా సరే కార్మికులకు మాత్రం పంచిన వాటా తగ్గిందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలి.వారికి రూ.5,500 ఇచ్చి అవమానపరిచారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు వేడుకుంటున్న ప్రధాన సమస్యలు పేర్క్స్ పై ట్యాక్స్ యాజమాన్యమే భరించాలని, కార్మికుల సొంతింటి కల నెరవేర్చి ప్రతి కార్మికుడికి రూ.20 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెమొరాండంలు ఇచ్చినా కానీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
అదేవిధంగా ఏఐటీయూసీ చేస్తున్న పోరాటాలు చూసి ఆకర్షితులు అవుతున్న యువ కార్మికులు యూనియన్ లో చేరుతున్నారని ఈ రోజు పీవీకే5 లో అమన్ అనే ఫిట్టర్ ను బ్రాంచ్ కార్యదర్శి కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.వీరాస్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తర్ల రాములు, పీవీకే5 పిట్ కార్యదర్శి హుమాయూన్, ఆఫీస్ బ్యారర్స్ సందబోయినా శ్రీనివాస్, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్, సీనియర్ నాయకులు కుర్రు రమేష్, భుక్య రమేష్, సాయి పవన్, రామచందర్, కుమారకృష్ణ, కుమార్ పాల్గొన్నారు.