ఇల్లెందు, డిసెంబర్ 02 : సింగరేణి ఇల్లెందు జెకె5 ఓసిలో విధులు నిర్వహిస్తుండగానే గుండెపోటుకు గురై సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి జెకె 5 ఓసిలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న పాల్వాయి శ్రీనివాసులు (59) ఎప్పటిలాగే మంగళవారం డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.
గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన సింగరేణి ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే శ్రీనివాసులు మరణించినట్లుగా నిర్ధారించారు. శ్రీనివాసులు మృతదేహాన్ని గుర్తింపు సంఘం నాయకులు కె.సారయ్య, ఎం.డి నజీర్ అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, గోచికొండ సత్యనారాయణ, కొండూరు చిన్న, బండి రాము, బాబురావు, టీబీజీకేఎస్ నాయకుడు జాఫర్ హుస్సేన్ సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.