– సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జీఎం శాలెం రాజు పిలుపు
రుద్రంపూర్, మార్చి 25 : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వృత్తి విద్యా కోర్సులు నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు తెలిపారు. జి.యం.ఆర్. వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ & లైవ్లీహుడ్స్ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్యా కోర్సులు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్‌ను మెరుగుపర్చుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రముఖ కంపెనీల సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించబడతాయని తెలిపారు. అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు నిపుణుల ద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ శిక్షణ అందించబడుతుందని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనలో కూడా సహకారం అందించబడుతుందని తెలిపారు.
వయస్సు: 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి
నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు కొత్తగూడెం ఏరియా సింగరేణి వి.టి.సి వద్ద నమోదు చేసుకోవాలి
– డ్రైవాల్ & ఫాల్స్ సీలింగ్ టెక్నిషియన్
– వెల్డింగ్ & ఫ్యాబ్రికేషన్ టెక్నిషియన్
– ఆటోమొబైల్ & టూ వీలర్ టెక్నిషియన్
– గెస్ట్ సర్వీస్ అసోసియేట్ (హోటల్ మేనేజ్మెంట్)
– ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్
– రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీషనింగ్ (ఆర్ఏసీ) టెక్నిషియన్
– ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ టెక్నిషియన్
– ఎక్స్కవేటర్ ఆపరేటర్
ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు ఎస్.ఓ టు జీ.ఎం ఎం.వెంకటేశ్వరరావు, కోటి రెడ్డి, ఏజీఎం (పర్సనల్) జి.వి. మోహన్‌రావు, జి.ఎం.ఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.