చిట్యాల, ఆగస్టు 4 : దేవుని భూమిపై తొండాట మొదలైంది. దాదాపు రూ. 1.50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నాయకుల అండతోనే జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దాదాపు 24 సంవత్సరాల క్రితం టీటీడీకి అప్పటి మార్కెట్ ధర ప్రకారం విక్రయిసున్నట్లు అగ్రిమెంటు చేసుకొని, డబ్బులు కూడా తీసుకున్న భూ యజమానులు, ఇప్పుడు తక్కువ భూమిని అగ్రిమెంటు చేసినట్లుగా మరో పత్రం సృష్టించి దాదాపు రూ. 1.50 కోట్ల విలువైన కమర్షియల్ భూమిని మిగిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇదంతా అధికార పార్టీ నేతల అండతోనే జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా అందుకు బలం చేకూర్చేలా భూ యజమానులు కొందరు మున్సిపల్ చైర్మన్ దంపతులు, ఓ కో ఆప్షన్ సభ్యురాలి భర్త సమక్షంలో చైర్మన్ చాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు ముఖ్యంగా వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేసి కొనుగోలు ఒప్పందం చేసుకున్న భూమిపై తొండాట ఆడుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
చిట్యాలలోని భువనగిరి రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 649లో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం 2002లో అప్పటి ఎంపీ, ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేసి ఎకరం 12 గుంటల భూమిని భూ యజమానుల వద్ద నుంచి సేల్ డీడ్ చేసుకున్నారు. మొత్తం 1 ఎకరం 12 గుంటలకు గుండు గుత్తగా రూ. 2.50 లక్షలు ఇచ్చేలా సేల్ డీడ్ చేసుకొని అందులో రూ. 2.25 లక్షలను వసూలు చేసిన డబ్బు నుంచి చెల్లించారు. మిగిలిన రూ. 25 వేలను రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. టీటీడీ పేరు మీద సేల్ డీడ్ చేశారు. అనంతరం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అప్పటి తాసీల్దార్ సర్వే చేయించి, ఆ మేరకు సర్వే పత్రాలను టీటీడీకి పంపిచారు.
ఈ మేరకు అక్కడ టీటీడీ కల్యాణం మండపం నిర్మించాలని కోరుతూ అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీటీడీకి లేఖ రాశారు. కాని ఏ కారణం చేతనో అగ్రిమెంటు చేసిన అనంతరం భూమి టీటీడీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. కాగా 2024లో ఆ భూమిలో కమర్షియల్ భూమిగా ఉన్న 11 గుంటలను వదిలి 1 ఎకరం 01 గుంట భూమిని మాత్రమే తాము టీటీడీకి అగ్రిమెంట్ చేశామని, దాని ప్రకారమే మున్సిపాలిటీకి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి భూ యజమానులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం యజమానులు 11 గుంటల భూమిలో ప్రీకాస్ట్ వాల్స్ పాతటంతో పట్టణ ప్రజలకు అనుమానం మొదలైంది. దీంతో కొద్ది రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొత్తం తెలిసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన వచ్చే వరకు వేచి చూడాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మున్సిపాలిటీలో భూ యజమానులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సమక్షంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటంతో అనుమానాలు మొదలయ్యాయి.
1.12 ఎకరాలకే ఒప్పందం
అప్పట్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచన మేరకే రైసు మిల్లుకు చెందిన 9 మంది పార్టనర్స్‌తో 1.12 గుంటల భూమికి సేల్ డీడ్ చేయించుకొని ఆ మేరకు డబ్బులు చెల్లించామని కాంగ్రెస్ నాయకుడు, ఒప్పంద పత్రం రాసిన పాటి నర్సిరెడ్డి తెలిపారు. కొంత మంది తప్పుదోవ పట్టిస్తూ కమర్షియల్ భూమిని దక్కించుకునే ఉద్దేశంతో ఎకరం 1 గుంట అంటున్నారని, అది వాస్తవం కాదని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ చేయాలి..
2002లో డబ్బులు తీసుకొని ఎకరం 11 గుంటల భూమిని టీటీడీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చేసుకున్న సేల్ డీడ్ ప్రకారం మొత్తం భూమిని ప్రభుత్వం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.