హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ప్రజల సభ షెడ్యూల్.. పాలకుల కాలపట్టికను బట్టి మారుతుందా? పాలకుల పాస్‌పోర్ట్‌లను చూసి తేదీలు నిర్ణయించుకుంటుందా? వర్షాకాల సమావేశాలను జనం అవసరాలే కాకుండా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యక్రమాలే నిర్దేశిస్తున్నాయా? వానకాలంలో రైతుల సమస్యల కంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తుందా? ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ క్యాలెండర్ లండన్ , అమెరికా టూర్ ప్లాన్లతో ముడిపడిందా? ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, రాజకీయ ప్రముఖుల కుటుంబ వేడుకలకు అనుగుణంగా వాయిదా పడుతున్నదా? వర్షాకాలం సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేశారా?
ఆ ఒక్క రోజు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరుగదా? అదికూడా రాజకీయ అవసరం కోసం ఆడే డ్రామానేనా? అంటే రాజకీయ వర్గాల్లో ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. దాదాపు 20 రోజులపాటు అమెరికా, బ్రిటన్‌లో పర్యటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ మూడో వారానికి వాయిదా వేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెలలో ఒకరోజుకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సాధారణంగా వర్షాకాల సమావేశాల్లో వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సమస్యలు, ఉపాధి, విద్య, వైద్యం, ఆర్థిక పరిస్థితి వంటి ప్రజా సంబంధ కీలక అంశాలపై విసృ్తతంగా చర్చ జరుగుతుంది. కానీ ఈసారి పూర్తి స్థాయి సమావేశాలను సెప్టెంబర్ మూడోవారానికి వాయిదా వేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఒక రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఆ ఒకరోజు కూడా ప్రజా సమస్యల మీద కాకుండా ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెడతారని, చర్చ జరిపి ఆమోదించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారట. అయితే.. సమావేశాల వాయిదాకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహం కూడా ఒక కారణమనే ప్రచారం జరుగుతున్నది. సీఎం తన పర్యటనలో భాగంగా ముందుగా లండన్‌లో జరుగనున్న అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎంకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా విదేశాలకు వెళ్తున్నారని, కాబట్టి అసెంబ్లీ సమావేశాలను ఆ తర్వాతే నిర్వహించాలని వారు కోరినట్టు చర్చించుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ షెడ్యూల్ ప్రజల అవసరాల కంటే పాలకుల కార్యక్రమాలకు అనుగుణంగా మారుతున్నదన్న విమర్శలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 17న రాష్ట్రం నుంచి బయలుదేరుతారని సమాచారం. యూకే, జర్మ నీ, అమెరికా, చైనా దేశాల్లో 24రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమావేశం, డిసెంబర్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2026కు ఆహ్వానించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని సీఎంవో అధికారులు చెప్తున్నారు. సీఎం సలహాదారు కే రామకృష్ణారావు, ఇతర అధికారులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
సెప్టెంబర్ 10న తిరిగి హైదరాబాద్ వస్తారని సీఎంవో అధికారులు చెప్తున్నారు. అత్యంత కీలకమైన శాసనసభ సమావేశాల తేదీలను ప్రజా అవసరాల కంటే రాజకీయ నాయకుల వ్యక్తిగత కార్యక్రమాలకు అనుగుణంగా నిర్ణయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శాసనసభను పూర్తిస్థాయిలో నిర్వహించకుండా వాయి దా వేయడం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.