దుండిగల్, ఆగస్టు 4: ప్రజా ధనానికి రెక్కలొచ్చాయో లేక అధికారుల ఉదారత హద్దులు దాటిందో గానీ, ప్రభుత్వ నిధులతో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ వాసులకు లబ్ధి జరిగేలా ఏకంగా డ్రైనేజీ లైన్ నిర్మించేస్తున్న విచిత్ర ఘట్టం వెలుగులోకి వచ్చింది. అనుమతులేమో వరద నీటి కాలువ (స్ట్రామ్ వాటర్ డ్రైయిన్) నిర్మాణానికైతే…క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం మురుగునీటి పారుదల పనులు…ఈ చేతివాటం వ్యవహారంతో చుట్టు పక్కల ప్రజలు, ముఖ్యంగా చెరువుపైనే ఆధారపడిన బతుకుతున్న మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో అధికార పార్టీల జోక్యం మీతిమీరుతుందని…కోతినార్ చెరువు ఘటనే ఇందుకు నిదర్శమని చెబుతున్నారు.
ప్రభుత్వనిధులతో ప్రైవేట్ అపార్ట్మెంట్లకు డ్రైనేజీని నిర్మించడంతో పాటు ఇప్పటి వరకు పరిశుభ్రంగా ఉన్న చెరువులోకి మురుగును కలిపే పనులను ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు సుందరీకరణ, అభివృద్ధి పేరిట చెరువులను ప్రక్షాళన చేస్తున్నామని స్వయాన సీఎం చెబుతుంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో మాత్రం ఇక్కడి అధికార పార్టీ నేతలు పరిశుభ్రంగా ఉన్న చెరువులోకి డ్రైనేజీనీటిని కలిపే ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రొటోకాల్ అనే పదమే మర్చిపోయిన ఇక్కడి నేతల్లో ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కాకపోయినా,అధికారులు రాకపోయినా దర్జాగా పనులు ప్రారంభించడం ఆనవాయితీగా మార్చుకున్నారు.ఇదంతా అధికార పార్టీనేతలు చేస్తున్న హడావిడి మాత్రమేనని ప్రజలు పెదవివిరుస్తున్నారు.తాజాగా ఈనెల 3వతేదీన(ఆదివారం) అధికార పార్టీ నేతలు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) నిధులతో దుండిగల్ విలేజ్ పరిధిలోని స్కంధా అపార్ట్‌మెంట్స్‌తో పాటు మరో పైవేట్ వెంచర్ కు ప్రయోజనం కలిగించేలా భూగర్భడ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టడం వివాదాస్పదంగా మారుతుంది.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)కు చెందిన నిధులు రూ.70లక్షలతో నిర్మిస్తున్న భూగర్భడ్రైనేజ్ పైపులైన్ ఔట్‌లెట్‌ను గాగిళ్లాపూర్లోని కోతినార్ చెరువులో కలుపడంపట్ల స్థానిక మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ ప్రయోజనం ఆశించి అధికార పార్టీ నేతలు ఇలాంటి పనులు ప్రారంభిస్తున్నారని మత్స్యకారులు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు పరిశుభ్రంగా ఉన్న చెరువులోకి డ్రైనేజీ నీటిని కలిపి కాలుష్యంగా కాసారంగా మార్చొద్దని సోమవారం గాగిళ్లాపూర్ విలేజ్ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ప్రైవేట్ అపార్ట్మెంట్ వాసులకు ప్రయోజనం చేకూర్చేందుకు తమపొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. మురుగు నీరు చేరడం కారణంగా కోతినార్ చెరువులోని చేపలు చనిపోతాయని తద్వారా మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.అదే సమయంలో చెరువు దుర్వాసన వెదజల్లడంతో పాటు గుర్రపుడెక్కవిపరీతంగా పెరిగి వ్యాధులకు మూలకారక మవుతుందన్నారు.అపార్ట్మెంట్ వాసుల ప్రయోజనాలు తప్ప అధికార పార్టీ నేతలకు తమ బాధలు పట్టవా…?అంటూ ప్రశ్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు,అపార్ట్మెంట్ వాసుల నుంచి వచ్చే ప్రయోజనాలు తప్పా తమ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించరా అంటూ వాపోతున్నారు.
ఏండ్లకేండ్లుగా చేపలు పట్టుకుని జీవించే తమ బతకులను నేతలు ఏం చేద్దామనుకుంటున్నారో తెలుపాలంటున్నారు. అభివృద్ధి పనుల పేరిట ఎక్కడ పడితే అక్కడ పనులు ప్రారంభిస్తున్న నేతలు,అవి నిజంగా ప్రజలకు ఉపయోగకరమేనా..?దీని వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా…అనే కనీస ఆలోచన చేయకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.వాస్తవానికి స్కంధా అపార్ట్మెంట్ నాలాకల్వర్టును ఆక్రమించి నిర్మించారని,దీనిపై అధికారులు విచారణ జరుపాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం ఆరాటపడి ఏకపక్షంగా చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మత్స్యకారులందరిని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
కేవలం వర్షపు నీరు మాత్రమే వెళ్లేలా కాలువ నిర్మాణం చేపడుతున్నామని చెప్పిన చోట..పూర్తిస్థాయిలో డ్రైనేజీ పైపులైన్లు వెలుస్తుండడం చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల పరిశీలన లోపించిందా? లేక కింది స్థాయి సిబ్బంది హస్తలాఘవంతోనే ఈ పనులు సాగుతున్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి కోతినార్ చెరువును కలుషితం కాకుండా కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.