Punjab : భారతీయుడికి సౌదీ అరేబియా కోర్టు మరణశిక్ష విధించింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడినందుకుగాను అతడికి ఈ శిక్ష ఖరారు చేసింది. దీంతో అతడిని శిక్ష నుంచి రక్షించాలని బాధితుడి కుటుంబం వేడుకుంటోంది. ఈ అంశానికి సంబంధించి బాధిత యువకుడి కుటుంబం చెబుతున్న వివరాలివి. పంజాబ్, పఠాన్కోట్ జిల్లా, సుజనాపూర్ పట్టణానికి చెందిన బల్జిందర్ సింగ్ పదేళ్లుగా దుబాయ్లో ట్రక్కు డ్రైవర్గా పని చేస్తున్నాడు.
అతడు దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకు సరుకులు రవాణా చేస్తుంటాడు. రెండు దేశాల మధ్య సరుకులు రవాణా చేస్తుంటాడు. కొంతకాలం క్రితం అతడు దుబాయ్ నుంచి సౌదీ వెళ్తుండగా అతడి స్నేహితుడు సౌదీలో ఉన్న ఒక వృద్ధుడి కోసం మెడిసిన్స్ అంటూ ఒక ప్యాకెట్ ఇచ్చాడు. సౌదీలో ఒకరికి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో సౌదీ వెళ్లేటప్పుడు ఆ ప్యాకెట్ తీసుకెళ్తుండగా సౌదీలో.. సరిహద్దు వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అది మెడిసిన్ కాదు.. నిషేధిత డ్రగ్ అని తేలింది. దీంతో సౌదీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన సౌదీ కోర్టు.. బల్జిందర్ సింగ్కు మరణశిక్ష విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ అంశంపై బల్జిందర్ సింగ్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అతడు ఏ నేరం చేయలేదని, కావాలని ఆ డ్రగ్స్ తీసుకెళ్లలేదని తెలిపింది. అనుకోకుండా కేసులో ఇరుక్కున్నాడని, పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి.. అతడిని రక్షించేందుకు న్యాయ సహాయం చేయాలని కోరింది. దౌత్యపరంగా జోక్యం చేసుకుని మరణ శిక్ష అమలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.