భోపాల్: తమ గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాన్వాయ్‌ను వారు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మించకపోతే ఓటు వేయబోమని హెచ్చరించారు. అయితే తనతో అలా మాట్లాడవద్దంటూ సింధియా వారిపై మండిపడ్డారు. (Jyotiraditya Scindia) మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలోని తన నియోజకవర్గం ప్రాంతంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యటించారు. ఒక గ్రామానికి ఆయన వెళ్లగా అక్కడి ప్రజలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణం, దాని దుస్థితిని ఆయనకు తెలియజేశారు. ‘రోడ్డు లేకపోతే ఓటు లేదు’ అన్న ఫ్లకార్డులను ప్రదర్శించడంతో పాటు ఆ మేరకు నినాదాలు చేశారు. తదుపరి ఎన్నికల లోపు రోడ్డు నిర్మించకపోతే తాము ఓటు వేయబోమని ఒక వ్యక్తి ఆయనకు చెప్పాడు.
కాగా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ వ్యక్తిపై ఆయన మండిపడ్డారు. ‘నాతో ఎప్పుడూ ఇలాంటి భాష వాడోద్దు. అర్థమైందా?’ అని అన్నారు. తనతో అలా మాట్లాడే బదులు ఒక అభ్యర్థన చేయాలని ఆ స్థానికుడికి ఆయన సూచించారు. ‘నేను అందరితోనూ మాట్లాడుతున్నా. మీరు వచ్చి మీ విన్నపాన్ని తెలియజేయండి. ఆ పనిని పూర్తి చేయించడం నా బాధ్యత. సరేనా?’ అని ఆయన అన్నారు.
ఆ తర్వాత జరిగిన బహిరంగ కార్యక్రమంలో రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సింధియా ప్రకటించారు. గునా ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య కోటాలోని ఎమ్మెల్యే నిధుల నుంచి ఆమోదించినట్లు తెలిపారు. వర్షాకాలం ముగిసిన తర్వాతే రహదారి నిర్మాణ పనులు చేపట్టేలా చూడాలని సింధియా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే రోడ్డు లేకపోతే ఓటు వేయబోమన్న స్థానికుడిపై కేంద్ర మంత్రి విరుచుకుపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Citizen: “Please get the road built on time, otherwise we won’t vote.”
Scindia: “Never use this language in front of me.” 🤬 pic.twitter.com/2QtDkAwDVg
— Gems (@gemsofbabus_) September 18, 2026