రామవరం, నవంబర్ 06 : గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు, వారి పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి సంస్థ చైర్మన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం కి ఫోన్ చేసి సమస్యను వివరించి వెంటనే పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ సమస్యను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 12న కొత్తగూడెంలో జరిగే మెగా జాబ్ మేళా వేదికగా సుమారు 470 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సంస్థ చైర్మన్ చేతుల మీదుగా ఇవ్వనున్నారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఎప్పటికప్పుడు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ, కార్మికుల సమస్యలపై పోరాట ఫలితమే ఈ విజయం అని కొత్తగూడెం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వట్టికొండ మల్లికార్జున అన్నారు.