– వికెసీఎం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి డైరెక్టర్ (పీ & పీ) కె.వెంకటేశ్వర్లు
రుద్రంపూర్, జూలై 07 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సింగరేణి డైరెక్టర్ (పీ & పీ) కె. వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న హరిత కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కొత్తగూడెం ఏరియాలోని వికెసీఎం ప్రాజెక్టులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించేందుకు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి చెట్టుగా పెంచినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందన్నారు.
అనంతరం వికెసీఎం వ్యూ పాయింట్‌ను సందర్శించి ప్రాజెక్టులో జరుగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలను పరిశీలించారు. ఉత్పత్తి పురోగతి, యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా, సమయానికి పూర్తి చేసేలా కృషి చేయాలని, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూనే ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, గనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు, ఎన్విరాన్మెంట్ జీఎం బి. సైదులు, వికెసీఎం ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వి. నరసింహారావు, ఎస్ఓటీయూ జీఎం ఎం. గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏజీఎం (ఫైనాన్స్) బీభత్స, ఏరియా ఇంజినీర్ వి. రామకృష్ణ, డీజీఎం (ఐఈడీ) ఎన్. యోహన్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ గోపు కుమార్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ, ఏరియా అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

‘మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత తీసుకోవాలి’