జూలూరుపాడు, డిసెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికల్లో బరిలో నిలిచిన బానోత్ బద్రి నామినేషన్ ఫీజు కోసం శుక్రవారం కాకర్ల పంచాయతీలో భిక్షాటన చేపట్టి నామినేషన్ ఫీజు సేకరించి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసింది. మండలంలోని దుబ్బతండాకు చెందిన బానోత్ బద్రి, భర్త శ్రీను స్థానికుల సహకారంతో పంచాయతీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాకర్ల సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచిన బద్రి 506 ఓట్లు సాధించి ఓటమి పాలయింది.
గత ఎన్నికల్లో ఓడిపోయిన తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆర్థిక సహాయం కోసం జోలె పట్టిన బానోత్ బద్రి నామినేషన్ ఖర్చులకు ప్రజల నుండి రూ.3 వేలు సమకూరాయి. ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిస్వార్ధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలను ఆమె వేడుకుంది. బద్రి నామినేషన్ కార్యక్రమంలో నాయకులు ముత్తినేని గోపి, అల్లాడి నరసింహారావు, పాతర్లపాటి సతీశ్, గొసి రామకృష్ణ, స్వామి పాల్గొన్నారు.