– బూర్గంపహాడ్ గ్రామ సభలో ఎంపీడీఓ జమలారెడ్డి
బూర్గంపహాడ్, జూన్ 08 : యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన ప్రత్యేక గ్రామ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ముందస్తు చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాలుగు రకాల చెత్త సేకరణ గురించి ప్రజలకు వివరించారు. రహదారులు, డ్రైనేజీలు, మురుగునీటి కాల్వలను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి తక్షణమే పూడిక తీయించాలని, వీధి దీపాలు పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
సర్పంచ్ మందా నాగరాజు మాట్లాడుతూ సభలో వచ్చిన ప్రజాసమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, వీధిలైట్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా సమస్యలు పంచాయతీ దృష్టికి తీసుకురావాలని దీంతో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ గ్రామసభలో పీఆర్ ఏఈ చక్రధరా చారి, వ్యవసాయాధికారి శంకర్, మిషన్ భగీరథ ఏఈ నితిన్, విద్యుత్ అధికారి ఆదినారాయణ, జీపీవో దీపిక, ఉపసర్పంచ్ గుండె వెంకన్న, కార్యదర్శి సంపత్ శ్రీనివాస్, భజన సతీష్, ప్రసాద్, బర్ల నాగమణి, హెచ్ఎం రవీలాదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని సారపాక పంచాయతీలో సర్పంచ్ కిశోర్నాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఎంపీడీఓ జమలారెడ్డి, తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ఆశయాల సాధన, పర్యావరణ పరిరక్షణపై చర్చించి ప్రజలకు అవగాహన కల్పించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రజాసమస్యలు పరిష్కరించేలా కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగభిక్షం, కార్యదర్శి గుగులోత్ రవికుమార్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.