Kangana Ranaut | బాలీవుడ్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరియు స్టార్ హీరో హృతిక్ రోషన్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘సారీ హృతిక్’ (Sorry Hrithik) ట్రెండ్ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. ఈ సోషల్ మీడియా ట్రెండ్‌పై హృతిక్ రోషన్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మవద్దని, వాస్తవాలు తెలిసే వరకు ఎలాంటి అభిప్రాయాలకు రావద్దని సూచించారు. అయితే హృతిక్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కంగనా రనౌత్, తన పేరును వాడుకుని సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిని ఆపకుండా, ఇలాంటి వ్యాఖ్యలతో వివాదానికి ఆజ్యం పోయవద్దని హితవు పలికారు.
సబా ఆజాద్‌తో నీవు సంతోషంగా ఉన్నావని తెలిసి ఆనందంగా ఉందని, మీరిద్దరూ మంచి జంట అని కంగనా పేర్కొన్నారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలతో తనను మాటలతో ఇబ్బంది పెట్టడం మీ స్థాయికి తగదని, మీ భాగస్వామిని కూడా ఇరుకున పెట్టేలా ప్రవర్తించవద్దని కంగనా తెలిపింది. కాగా, 2016లో కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌ను తన ‘సిల్లీ ఎక్స్’ అని సంబోధించడంతో వీరిద్దరి మధ్య అసలు వివాదం ప్రారంభమైంది. తాము ఎప్పుడూ రిలేషన్షిప్లో లేమని హృతిక్ బహిరంగంగా ఖండించడం, ఆ తర్వాత ఇరువర్గాల మధ్య లీగల్ నోటీసులు, ఈమెయిల్స్ వివాదం బాలీవుడ్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఇన్నాళ్లూ సద్దుమణిగిందనుకున్న ఈ పాత వివాదం, తాజా పరిణామాలతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.