– మొక్కజొన్న, వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్
ఇల్లెందు, మే 20 : మొక్కజొన్న, వడ్లను యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, దళారీలను కట్టడి చేయాలని, మద్దతు ధర చెల్లించాలని, కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎమ్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం ఇల్లెందు న్యూడెమోక్రసీ కార్యాలయం నుండి రైతులు, నాయకులు ప్రదర్శన నిర్వహించి కొత్త బస్టాండ్ సెంటర్లో సడక్ బంద్ నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అవకతవకలపై గత నెల రోజులుగా రైతాంగం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం సకాలంలో వరి ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడం వల్ల కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించక పోవడం వల్ల వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఇల్లెందులో సడక్ బంద్
అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తక్షణమే పంటలు కొనుగోలు చేయాలని, దళారీలను అరికట్టాలని, కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించాలని, తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని, కళ్లాల్లో ఉన్న ధాన్యానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించడం వల్ల ఇల్లెందు సిఐ సురేష్ జోక్యం చేసుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఇల్లెందులో సడక్ బంద్
ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తుపాకుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పొడుగు నరసింహారావు, సూర్ణపాక నాగేశ్వరరావు, పూనెం రంగయ్య, యదళ్లపల్లి సత్యం, కొక్కు సారంగపాణి, తోడేటి నాగేశ్వరరావు, పర్శిక రవి, మూడు మాలు, మోకాళ్ల కృష్ణ, జరుపుల కిషన్, భూక్యా మంగ్యా, వాంకుడోత్ మోతిలాల్, కల్తీ కోటమ్మ, నరాటి వెంకన్న, ఎల్. చిన్నస్వామి, గుర్రం యాదగిరి, సామెల్, గొగ్గెల రాజు, చింత నరసింహారావు, తేజావత్ లాలు, గూళ్ల సదయ్య, వాంకుడోత్ శ్రీను, తుడుం శ్రీను, బొమ్మెర్ల వీరన్న పాల్గొన్నారు.