జూలూరుపాడు, జూన్ 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తున్న భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కొత్తగూడెం నుండి జగ్గయ్యపేట వైపు వెళ్తున్న యాష్ ట్యాంకర్ లారీ మాచినేనిపేట తండా సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి రెండు వాహనాల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
కాగా ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లెందుకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సాంబశివరావుతో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మాలపాడు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కోటయ్యకు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డుపై ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి ప్రమాదం జరిగిన తీరుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు, యాష్ ట్యాంకర్.. ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలు