బూర్గంపహాడ్, ఏప్రిల్ 13 : ప్రజలు, వాహనదారులు రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. సోమవారం రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం చేపట్టి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ మాట్లాడుతూ అరైవ్ అంటే ఇంటి నుండి బయటకు ఎలా వెళ్లామో… అలైవ్ అంటే అంతే సురక్షితంగా ఇంటికి రావడం అని తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న నేపధ్యంలో వాహనదారులు, ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ఆ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. ప్రమాదాలకు నిలయమైన ప్రదేశాల్లో గుంతలు ఉంటే తాత్కాలికంగా పూడ్పించాలని, మూలమలుపుల వద్ద పెరిగే పిచ్చి చెట్లు, ముళ్లపొదలు తొలగించాలని పంచాయతీ సర్పంచ్ మందా నాగరాజుకు సూచించారు.
అన్ని పంచాయతీల్లో సర్పంచులు ఈ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను అందరి బాధ్యత తీసుకుని ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమం సారపాక పంచాయతీ కార్యాలయంలో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ గుండె వెంకన్న, డీటీ సమ్మయ్య, అదనపు ఎస్ఐ దేవ్సంగ్, న్యాయవాది భజన సతీష్, స్థానిక నాయకులు భజన ప్రసాద్, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి బర్ల ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.