జూలూరుపాడు, జూన్ 20 : రెవెన్యూ సదస్సులో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఈ మేరకు జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేటతండాలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తాసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. భూ భారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకునే రైతులకు క్షేత్రస్థాయిలో సర్వే చేసిన వెంటనే హక్కులు కల్పించేలా చూడాలన్నారు. సారవంతమైన భూములకు పట్టా పాస్ పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్న బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఉన్నత చదువుల కోసం కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.