మునుగోడు, ఫిబ్రవరి 14 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ మునుగోడు మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ, కార్మిక రంగాలను సంక్షోభంలోకి నెట్టేందుకు కుట్రలు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల పేరుతో రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు నెడుతుందని ఆరోపించారు. వరి ధాన్యం, పత్తి పంటలను మార్కెట్లో అమ్మలేని పరిస్థితికి తీసుకొస్తుందని విమర్శించారు. ఎరువుల సబ్సిడీలను తగ్గించి రైతులపై ఎనలేని భారం మోపిందన్నారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ల పేరుతో పత్తి రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
యూరియా కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, స్లాట్ల బుకింగ్ మాయా మార్కెట్ గా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురజా రామచంద్రం, బి.లాలు, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సురిగి చలపతి, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, మండల కార్యవర్గ సభ్యులు బండమీది యాదయ్య, దుబ్బ వెంకన్న, మందుల పాండు, మునుగోటి దయాకర్, మాదగోని సత్తమ్మ పాల్గొన్నారు.