Poultry Farm | నర్సాపూర్, ఫిబ్రవరి 14 : బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు హల్ చల్ చేశారు. రాత్రి సమయంలో దుండగులు కోళ్లఫారంలోకి దూరి 50 నాటుకోళ్లను దొంగిలించారు. ఈ సంఘటన నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
బాధితుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గ్రామ శివారులో కోళ్లఫారం కట్టి నాటు కోళ్ళను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం శ్రీనివాస్ గౌడ్ కోళ్లకు దానా వేసి ఇంటికి వచ్చాడు. అయితే ఇదే అదనుగా భావించిన దుండగులు కోళ్లఫారానికి గల ఇనుప జాలీని కట్ చేసి అందులోకి దూరి 50 నాటు కోళ్లను ఎత్తుకెళ్లారు.
చోరీ అయిన నాటు కోళ్ల విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని, కుటుంబ సభ్యులమంతా రాత్రనకా, పగలనకా కష్టపడుతూ కోళ్ల పారాన్ని సాకుతున్నామని బాధితుడు శ్రీనివాస్ గౌడ్ వాపోయాడు. దుండగులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.