రుద్రంపూర్, ఫిబ్రవరి 14 : కొత్తగూడెం పట్టణానికి చెందిన యువ క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కావడం జిల్లా క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచింది. త్రీ ఇంక్లైన్, ధన్బాద్ గ్రామ పంచాయతీ ప్రాంతాలకు చెందిన కే.లిఖిత్ చరణ్, వి.సాయి శృతి, వి.శరణ్య తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఇటీవల కొత్తగూడెంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఈ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
కే. లిఖిత్ చరణ్ – 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం
వి. సాయి శృతి – 62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం
వి. శరణ్య – 46 కేజీల విభాగంలో స్వర్ణ పతకం
స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా జిల్లా జట్టులో స్థానం సంపాదించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను కొత్తగూడెం 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి జిల్లా కీర్తిని మరింత పెంచాలన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షుడు ఐ.ఆదినారాయణ, జాతీయ రెజ్లింగ్ క్రీడాకారిణి పి.నిహారిక పాల్గొన్నారు.