జూలూరుపాడు, ఏప్రిల్ 02 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండను సీపీఎం జూలూరుపాడు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం జూలూరుపాడు ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి యాస నరేశ్ మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాలు పచ్చని అడవిని నాశనం చేయొద్దనని, భూమిని వేలం వేసి బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకుని వర్సిటీ భూమిని కాపాడాలని, తక్షణమే విద్యార్థులపై అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు విద్యార్థులను పరామర్శించడం కోసం వెళ్లిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ప్రజలు, విద్యార్థుల తరఫున ఉద్యమ కార్యరూపాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు వి.చందర్రావు, మండల నాయకులు గార్లపాటి వెంకట్, పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, జెల్లిక రాధాకృష్ణ, ఆనుగంటి సత్యనారాయణ, గడిదేశి కనకరత్నం, బోడ అబిమిత్ర, బొల్లు లక్ష్మయ్య పాల్గొన్నారు.