– జూలూరుపాడులో బీఆర్ఎస్ బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం
– సైనికుల్లా శ్రమించి ఓట్ల నమోదును పూర్తి చేయాలని పిలుపు
-ఆంధ్రాకు నీటి తరలింపునకు కుట్ర
– హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
జూలూరుపాడు, జూలై 15 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు.
గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేయడం లేదని ఆయన ఆరోపించారు. కన్నెపల్లి, దేవాదుల పంప్ హౌస్ లలో నీటిమట్టం పుష్కలంగా ఉన్నప్పటికీ పంపింగ్ చేయడం లేదన్నారు. కానీ, ఆంధ్రా బోర్డర్ కు నీళ్లు ఇచ్చేందుకు మాత్రం జూలూరుపాడు నుంచి ఏన్కూర్ మండలంలోని సాగర్ కాల్వ వరకు కాలువ తవ్వి సత్తుపల్లి వైపు నీటిని తరలించేందుకు ఆగమేఘాల మీద కాలువలు తవ్వుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం, సీతారామ లాంటి ప్రాజెక్టులను నిర్మిస్తే.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఉద్దేశపూర్వకంగా నిరుపయోగంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల హామీలను గాలికొదిలేసిందని, నిధులు లేవని సాకులు చెబుతూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు అలుముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సలహాలు ఇస్తే స్వీకరించకపోగా పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సాగు కోసం నానా అవస్థలు పడుతున్నారని, కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి దాపురించిందన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల కళ్లల్లో మట్టి కొడుతున్న ఈ దుర్మార్గపు పాలనపై ప్రజలు, రైతులు ఏకమై నిలదీయాలని పిలుపునిచ్చారు.
మండల వ్యాప్తంగా వంద శాతం ఓట్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కదలాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. పార్టీకి మూలస్తంభాలైన బీఎల్ఏలు రాబోయే వారం రోజుల పాటు సైనికుల్లా శ్రమించాలన్నారు. ప్రతి బిఎల్ఏ స్వయంగా గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి, అర్హులైన వారందరితో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయించి, వాటిని బూత్ లెవెల్ అధికారులకు అందజేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఫారాలు అందకపోతే వెంటనే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సకాలంలో సమర్పించేలా చొరవ చూపాలని స్పష్టం చేశారు. అప్పటికే ఖమ్మం జిల్లాలో 65 నుంచి 75 శాతం ఓట్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనిని ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్.జె.సి కృష్ణ, లాకావత్ గిరిబాబు, ఎల్లంకి సత్యనారాయణ, కట్టా కృష్ణార్జున రావు, యదళ్లపల్లి వీరభద్రం, చాపలమడుగు రామ్మూర్తి, దుద్దుకూరి నాగేశ్వరరావు, తాళ్లూరు రామారావు, సేవా, జవహార్ లాల్తో పాటు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.